diwali greetings

by ramurasa armoor | 10/27/2008 06:03:00 PM in | comments (3)

















నువ్వుల నూనెలో- లక్ష్మీదేవీ, నీటి వనరులలో- గంగాదేవీ
.
దీపావళి అంటే దీపోత్సవం. ఈ దివ్వెల పండుగ రోజున సర్వశుభాలు, సంపదలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఆ రోజు దీపలక్ష్మి తన కిరణాలతో అమావాస్య చీకట్లను పాలద్రోలి జగత్తును తేజోవంతం చేస్తుందని ఆనవాయితీ.
.
"తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళి తిథౌవసేత్!

అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే!."

.
దీపావళినాడు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి, నదులు, బావులు, చెరువులు మొదలైన నీటి వనరులలో గంగాదేవి సూక్ష్మ రూపంలో నిండి వుంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుచేత ఆ రోజున నువ్వుల నూనెతో తలంటుకుని సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియల పాటు అరుణోదయ కాలంలో అభ్యంగన స్నానం తప్పకుండా చేస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితుల విశ్వాసం.
.
ఇలా చేయడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుందని, దీపావళి రోజున గంగానదీ స్నాన ఫలం సకల మోక్షాలకు, ఐష్టైశ్వర్యాలను ప్రసాదించడంతో పాటు నరక భయాన్ని తొలగిస్తుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
.
అదే విధంగా అమావాస్యనాడు స్వర్గస్థులైన పితృదేవరులకు తర్పణం విడవడం విధి కనుక... ఆ రోజున పురుషులు తైలాభ్యంగన స్నానం చేసి "యమాయ తర్పయామి, తర్పయామి తర్పయామి" అంటూ మూడుసార్లు దోసెట్లో నీరు విడిచిపెట్టడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెంది ఆశీర్వదిస్తారని పురాణాలు వెల్లడిస్తున్నాయి.
.
ఇకపోతే... దీపావళి నాడు స్త్రీలు అభ్యంగన స్నానానంతరం కొత్త బట్టలు ధరించి, గృహానికి ముందు రంగురంగుల ముగ్గులు వేసి, గుమ్మాలను పసుపు, కుంకుమలతో అలంకరించి, మామిడాకు తోరణాలు కట్టి సాయంత్రం లక్ష్మీపూజ చేస్తే సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం.
.
లక్ష్మీపూజకు పిండివంటలను నైవేద్యంగా సమర్పించి, మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి పూజాగృహంలో, ఇంటి బయట దీప తోరణాలు అమర్చడం ద్వారా ఆ గృహం సిరిసంపదలతో వెల్లివిరుస్తుందని పండితులు పేర్కొంటున్నారు.

భారతీయ సంస్కృతికి అద్దం పట్టే పర్వదినాల్లో... అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ దీపావళి. ఆశ్వీయుజ మాస బహుళ చతుర్దశి నాడు నరక చతుర్దశిగాను, అమావాస్యను దీపావళిగా ఘనంగా జరుపుకుంటున్నారు. నరకాసురుడు అనే రాక్షసుడి నుంచి దేవతలకు విముక్తి లభించిన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. దీపావళి రోజున దీపాలంకరణలు చేసి బాణసంచా కాల్చడం ఆనవాయితీ.
.

"దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వకమోపహమ్
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప న్నమోస్తుతే.."
.

జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి, ఆనందానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. అందుకే దీపావళి రోజున మహాలక్ష్మీ పూజ చేసి గృహాల్లో దీపాలను అలంకరించుకుంటారు.
.

దీపావళి రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడాని ఓ విశిష్టత ఉంది. అదేమిటో తెలుసా? పూర్వం దుర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుడైన ఇంద్రుని ఆతిథ్యానికి పరవశించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ఇంద్రునికి ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కరించే రీతిలో, తన వద్ద నున్న ఐరావతమైన ఏనుగు మెడలో వేయగా... అది ఆ హారాన్ని కాలితో తొక్కి వేస్తుంది. దానిని చూసిన దుర్వాస మహర్షి కోపగ్రస్థుడై దేవేంద్రునిని సర్వసంపదలు కోల్పోదువుగాక అని శపిస్తాడు.
.

దుర్వాస మహర్షి శాపానికి గురైన ఇంద్రుడు రాజ్యం, సంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ స్థితిని గమనించిన శ్రీహరి దేవేంద్రుని ఓ జ్యోతిని వెలిగించి దానిని మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు.
.

దేవేంద్రుని పూజకు సంతృప్తి చెందిన లక్ష్మీదేవి దేవేంద్రుని అనుగ్రహించి దుర్వాస మహర్షి శాపం నుంచి విముక్తి కలిగిస్తుంది. శ్రీహరికి ధర్మపత్నిగానే కాకుండా నన్ను కొలిచే భక్తులకు అష్టలక్ష్మీ దేవిగా అనుగ్రహిస్తానని తెలుపుతుంది.

దీపావళికి సన్నిహితులకు శుభాకాంక్షలు ఎలా చెప్పాలో తెలుసా? పిండివంటలతో పాటు శ్రీ లక్ష్మీ స్తోత్ర పుస్తకాలను కూడా అందజేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం మీ గృహంలో నివాసముంటుంది. అదే విధంగా మీరు అప్పుల బారి నుండి విముక్తి పొందాలంటే... దీపావళి రోజున శ్రీలక్ష్మీ నిత్యపూజ లేదా శ్రీ ధనలక్ష్మీ నిత్య పూజలు చేయాలి.
ఈ పర్వదినాన శ్రీలక్ష్మి కుబేర వ్రతాన్ని ఆచరించి ఇంటికి విచ్చేసే సుమంగళి స్త్రీలకు పసుపు, కుంకుమలతో పాటు వస్త్రాదులను దానం చేస్తే సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం.
ఇక... దీపావళి నాడు ఆలయాల్లో నిర్వహించే శ్రీ మహాలక్ష్మీ కోటి కుంకుమార్చన, శ్రీ మహాలక్ష్మీకి 108 కలువ పువ్వులతో చేసే పూజల్లో పాల్గొంటే పుణ్యం లభిస్తుందని ఐతిహ్యం.
ఇకపోతే... దీపాలను అందంగా అలంకరించుకోవడమే దీపావళి పండుగకు గల ప్రత్యేకమన్న విషయం అందరికీ తెలిసిందే. వెండితో తయారైన దివ్వెలలో ఆవునెయ్యిని పోసి తామరవత్తులను దీపాలను వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
ఇదే రోజున సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో నుదుట కుంకుమను దిద్దుకుని, పూజగదిలో రెండు పంచముఖ దీపపు సెమ్మెలలో తామర వత్తులను అమర్చి వెలిగించాలి. తర్వాత ఇంటి నిండా దివ్వెలను వెలిగించి, ఓం మహాలక్ష్మీ దేవ్వ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.


. దీపావళి రోజున ఉదయం ఐదు గంటలకు లేచి, తలస్నానం చేసి పూజామందిరం ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరంలో అందమైన ముగ్గులతో తీర్చిదిద్దుకోవాలి. తెలుపు బట్టలు ధరించి... దైవ మూర్తుల పటాలకు గంధము, కుంకుమలతో అలంకరించాలి.
ఆ తర్వాత ఆకుపచ్చని రంగుతో కూడిన కూర్చున్న శ్రీ లక్ష్మీదేవీ పటాన్నిగానీ, వెండితో తయారైన లక్ష్మీదేవి ప్రతిమను గానీ పూజకు సిద్ధం చేసుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్ర పద్మాలు, తెలుపు కలువ పువ్వులు, గులాబి పువ్వులతో లక్ష్మీదేవి అర్చించాలి.
జామకాయలు, రవ్వలడ్డులు, కేసరి బాత్, అరిసెలు వంటి పిండిపదార్థాలను నైవేద్యం పెట్టి శ్రీ లక్ష్మీ అష్టోత్తరము, శ్రీ మహాలక్ష్మీ అష్టకం స్తోత్రాలను పఠించాలి. అంతే కాకుండా శ్రీ సూక్తము, శ్రీ లక్ష్మీ సహస్రనామము, భాగవతము, కనకధారాస్తవము వంటి పారాయణ స్తోత్రాలతో లక్ష్మీదేవిని పూజించాలి. అందులో ముఖ్యంగా భాగవతములోని నరకాసురవధ అధ్యాయమును పారాయణము చేయాలి.
దీపావళి రోజున మహాలక్ష్మీ ధ్యానించి విశాఖ కనకమహాలక్ష్మీ దేవి, అష్టలక్ష్మీ దేవాలయం, కొల్హపూర్ వంటి క్షేత్రాలను దర్శించుకుంటే సకల సంపదలు దరిచేరుతాయని విశ్వాసం. ఇదే రోజున కుంకుమ పూజ గావించిన స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తం చేకూరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
దీపావళి పర్వదినాన దేవాలయాల్లో శ్రీ లక్ష్మీ అష్టోత్తర నామ పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఐతిహ్యం. అంతేకాకుండా నరకాసురుని వధించిన దీపావళి రోజున లక్ష్మీ కుబేర వ్రతము లేదా వైభవలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పెద్దలంటున్నారు.

Blog Archive

About me