భధ్రాచలం
వరంగల్లు నుండి డోర్నకల్ చేరి బండి మారి భద్రాచలం రోడ్డు స్టేషను చేరవచ్చును. అక్కడినుండి బస్సులలో భద్రాచలం చేరవచ్చును. భద్రాచలం చాలా చిన్న ఊరు. సుమారు 10 నుండి 15 వేలలోపు జనాభా. క్షేత్ర పాశస్త్యము చాల విశేషం. ఇక్కడి క్షేత్రం జాతీయ ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. పావన గోదావరి వొడ్డున శ్రీ సీతారామచంద్ర స్వామి వేంచేసియున్న ఆలయము చరిత్ర ప్రసిద్ధము.
క్షేత్ర వైభవం
మేరువుకు భద్రుడనే కొడుకున్నాడు. ఈయన ఒక పర్వతరాజు. ఇతడు గౌతమీ తీరంలోగల దండకారణ్యంలో ఘోరమైన తపస్సు చేసి శ్రీరామచంద్రుని సాక్షాత్కారాన్ని పొందాడు. శ్రీ రాములవారు వరం కోరుకొమ్మని అడిగితే కైలాసగిరి మీద శివుడలంకరించునట్లు తన శిఖరముమీద శ్రీ సీతారామలక్ష్మణ సమేతులైన రామ ప్రభువును తన శిఖరము నలంకరించి జీవులకు మోక్షసామ్రాజ్య మందించవలయునని కోరుకొన్నాడట భద్రుడు. అతని కోరిక ప్రకారం అక్కడకు సీతాలక్ష్మణ సహితులైన రామప్రభువు వేంచేసి కొలువుదీరి యున్నాడు. ఇది సంగ్రహంగా పురాణ కధ.
కంచర్ల గోపన్న గొప్ప రామభక్తుడు. ఆనాటి తానీషా ప్రభువు దక్కను సామ్రాజ్యాన్ని ఏలుచున్నవాడు. ఆయనకు అక్కన్న, మాదన్న యను మంత్రులున్నారు. వీరు కంచర్ల గోపన్నకు దగ్గర బంధువులు. వారి ప్రాపకంవల్ల కంచర్ల గోపన్న 1670లో పరగణాధికారము పొందాడు. 1674 వరకు శ్రీ రామాలయము నిర్మాణం చేయించినాడు. సర్కారుకు కట్టవలసిన పన్నుడబ్బును ఆలయ నిర్మాణానికి వెచ్చించినందుకు 1686 వరకు కారాగారబద్ధుడైనాడు. శ్రీ సీతారామస్వామి లక్ష్మణ సమేతుడైవచ్చి గోల్కొండకోట పట్టణంలో వున్న తానీషా ప్రభువుకు బాకీని చెల్లించి మహా భక్తుడైన శ్రీ గోపన్నను కారాగార విముక్తుని చేసినట్లుగా చెప్పుకుంటారు.
భద్రాచల ఆలయమున గోపన్నగారు చేయించిన బంగారు ఆభరణములన్ని అద్దాల బీరువాల్లో ఇప్పటికీ భద్రంగా వుంచబడినవి. వాటిని కూడా దర్శించవచ్చు.
స్వామి వారి నిత్యోత్సవాలు:
ప్రభాతసేవ, దంత ధావనోత్సవం, బాల భోగాది ఆరాధనలు, పవళింపు సేవ వరకు చూడవచ్చును. పునర్వసు నక్షత్రము గల రోజులు, ఏకాదశి, పూర్ణిమ తిధుల యందు, సంక్రమణముల యందు స్వామి వారికి అభిషేక, సహస్ర నామార్చన, గ్రామోత్సవాదులు చేయబడును.
శ్రీ రామ నవమి కళ్యాణోత్సవము
ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు కళ్యాణోత్సవము చాలా విశేషము. జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకున్నది. కళ్యాణోత్సవమును తిలకించటానికి లక్షల మంది యాత్రికులు వస్తారు. వసతి సౌకర్యాలు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం విశేషమైన శ్రద్ధాసక్తులతో ఏర్పాట్లు దగ్గర వుండి పర్యవేక్షిస్తారు. ఉత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మెదలయిన ప్రముఖులు, ప్రభుత్వ అధినేతలు, అధికారులు గూడ పాల్గొంటారు. ఇక్కడ జరిగే కళ్యాణోత్సవ కార్యక్రమాలు ఆలిండియా రేడియో; టి.వి.ల్లో ప్రసారం చేయబడతాయి.