నువ్వుల నూనెలో- లక్ష్మీదేవీ, నీటి వనరులలో- గంగాదేవీ
.
దీపావళి అంటే దీపోత్సవం. ఈ దివ్వెల పండుగ రోజున సర్వశుభాలు, సంపదలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఆ రోజు దీపలక్ష్మి తన కిరణాలతో అమావాస్య చీకట్లను పాలద్రోలి జగత్తును తేజోవంతం చేస్తుందని ఆనవాయితీ.
.
"తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళి తిథౌవసేత్!

అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే!."

.
దీపావళినాడు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి, నదులు, బావులు, చెరువులు మొదలైన నీటి వనరులలో గంగాదేవి సూక్ష్మ రూపంలో నిండి వుంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుచేత ఆ రోజున నువ్వుల నూనెతో తలంటుకుని సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియల పాటు అరుణోదయ కాలంలో అభ్యంగన స్నానం తప్పకుండా చేస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితుల విశ్వాసం.
.
ఇలా చేయడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుందని, దీపావళి రోజున గంగానదీ స్నాన ఫలం సకల మోక్షాలకు, ఐష్టైశ్వర్యాలను ప్రసాదించడంతో పాటు నరక భయాన్ని తొలగిస్తుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
.
అదే విధంగా అమావాస్యనాడు స్వర్గస్థులైన పితృదేవరులకు తర్పణం విడవడం విధి కనుక... ఆ రోజున పురుషులు తైలాభ్యంగన స్నానం చేసి "యమాయ తర్పయామి, తర్పయామి తర్పయామి" అంటూ మూడుసార్లు దోసెట్లో నీరు విడిచిపెట్టడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెంది ఆశీర్వదిస్తారని పురాణాలు వెల్లడిస్తున్నాయి.
.
ఇకపోతే... దీపావళి నాడు స్త్రీలు అభ్యంగన స్నానానంతరం కొత్త బట్టలు ధరించి, గృహానికి ముందు రంగురంగుల ముగ్గులు వేసి, గుమ్మాలను పసుపు, కుంకుమలతో అలంకరించి, మామిడాకు తోరణాలు కట్టి సాయంత్రం లక్ష్మీపూజ చేస్తే సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం.
.
లక్ష్మీపూజకు పిండివంటలను నైవేద్యంగా సమర్పించి, మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి పూజాగృహంలో, ఇంటి బయట దీప తోరణాలు అమర్చడం ద్వారా ఆ గృహం సిరిసంపదలతో వెల్లివిరుస్తుందని పండితులు పేర్కొంటున్నారు.

0 comments:

Blog Archive

About me