వైకుంఠ ఏకాదశి రోజున జాగరణ చేయండి… వైకుంఠ ఏకాదశి పూజకు ఇలా సిద్ధం కండి…
వైకుంఠ ఏకాదశి రోజున జాగరణ చేయండి
ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని వేయికనులతో వీక్షించి, శ్రీహరిని సేవించి తరించాలని మూడు కోట్లమంది దేవతలు వైకుంఠమునకు చేరుకునే రోజే వైకుంఠ ఏకాదశిగా పరిగణించబడుతోంది. ఈ వైకుంఠ ఏకాదశి శనివారంలో వస్తే మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.
.
ముక్కోటి ఏకాదశి రోజున విష్ణు, వెంకన్న దేవాలయములకు వెళ్లి స్వామివారిని దర్శించుకుని విష్ణు అష్టోత్తరమును పఠించడం మంచిది. అదే రోజున సత్యనారాయణ వ్రతమును ఆచరించి విష్ణుమూర్తిని నిష్ఠతో పూజించే వారికి అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
.
ఆ రాత్రి నిద్రపోకుండా విష్ణు నిత్యపూజ, విష్ణు స్తోత్రమాల, విష్ణు సహస్రనామ స్తోత్రములతో పారాయణ చేయాలి. మరుసటి రోజు ఉదయం శుచిగా స్నానమాచరించి శ్రీహరిని పూజించి సన్నిహితులకు శుభాకాంక్షలు తెలయజేయడం శుభప్రదం.
.
విష్ణు సహస్ర నామ సోత్రమ్, విష్ణు పురాణం, సత్యనారాయణ స్వామి వ్రతము వంటి పుస్తకాలను ఫల, పుష్ప, తాంబూలాలతో స్త్రీలకు దానం చేయడం మంచిది. అదేవిధంగా ఏకాదశిన దేవాలయాల్లో విష్ణుమూర్తికి లక్ష తులసి పూజ చేయించేవారికి సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి.
.
వైకుంఠ ఏకాదశి పూజకు ఇలా సిద్ధం కండి
వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠనియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించేవారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారికోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది.
.
అందుచేత వైకుంఠ ఏకాదశి (జనవరి-7) రోజున ఉదయం ఐదు గంటలకే లేచి, శుచిగా స్నానమాచరించాలి. పూజా మందిరమును శుభ్రపరచి, గడపకు పసుపు, కుంకుమలు, తోరణాలు, ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానము చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజామందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధద్రవ్యాలతో అలంకరించుకోవాలి.
.
విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు కలశమును పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రముతో కప్పి, టెంకాయ మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి. పూజకు తామరపువ్వులు, తులసి దళములు ఉపయోగించాలి.
.
ఇకపోతే... వైకుంఠ ఏకాదశి రోజున జాజిపువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లైతే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత జాజిమాలను విష్ణుమూర్తి పటానికి వేసి, పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యం సమర్పించి శ్రీహరిని స్తుతించడం శుభప్రదమని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.